“ట” కారాలతో వచ్చే తిప్పలు!!!

తెలుగు అక్షరమాలలో (ఏ భాషలో అయినా అనుకోండి) ఏ అక్షరం రాకపోయినా మనం మాట్లాడలేం,గుణింతాలు రాకపోతే మాట్లాడగల్గుతాం కానీ రాయలేము. అక్షరమాలలో ఒకటి తక్కువ మరొకటి ఎక్కువ అనేదే లేదు,ఏ ఒకటి రాకపోయినా కష్టమే.

అందులో “ట” అక్షారానికి ఉన్న ప్రత్యేకత-దాని ప్రభావం ఎలాగుంటుందో చూద్దాము;

మనం నిత్యజీవితంలో బోలెడు సంఘటనలు చూస్తుంటాం,కొన్ని ఇతరుల ద్వారా వింటుంటాం-మంచివి కావచ్చు అది చెడువి కావచ్చు.ఇది చాలా చాలా సహజం ప్రతీఒక్కరి జీవితాల్లో,ఇందులో పెద్ద వింతాలేదు విశేషమూ లేదు.అలా అని ఇతరులు చెప్పేవి అన్నీనమ్మలేం కూడా-వాళ్ల కబుర్లు ముఖ్యంగా“ట”తో అంతమయ్యేటప్పుడు!

వచ్చిన తిప్పలు, ఇబ్బంది ఎక్కడంటే ఈ "ట"కారాలలోనే!

మచ్చుకి కొన్ని“ట” కారాలు చూద్దాం...

మొన్న పార్కులో పక్కింటాయన, ఎదురింటావిడ మా ఫ్రెండ్ కి కనిపించారు “ట”!

వాళ్లిద్దరూ కూరలబజారులో కూడా కనపడ్డార “ట”!

ఏం లేకుండా అలా ఎలా కలుస్తున్నార “ట”!

ఆఫీస్ కాంటీన్ లో రాధా,రవి పక్కపక్కనే కూర్చొని ఒకటే గుసగుసల “ట”,

చెవులూ చెవులూ కొరుక్కుంటున్నార “ట”!

పార్కులకి పబ్బులకి కలిసి తిరుగుతున్నార “ట”!

ఆఫీస్ లో అందరూ అవే గుసగుసల “ట”!

పక్క సందులో సూర్యా రావు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడ “ట”, ఆ అమ్మాయికి మాయరోగమా, పెళ్లిఅయిన వాడితో తిరగడం -సూర్యారావు తప్పు ఇసుమంతయినా లేదు.అసలు ఇందులో నిజం ఎంతో ఏమిటో తెలియకుండానే తీర్మానించేస్తారు, తీర్పు చెప్పేస్తారు -ఇవన్నీ "ట" ల తోనే.

ఈ మధ్యన మా ఇంటికింద ఫ్లోర్ లో ఆయన బాగా దగ్గుతున్నాడు,కోవిడ్ అయి ఉండచ్చు“ట”! ఇలాంటి జనాన్ని చూసే వచ్చే దగ్గు ఆపుకోలేక చస్తున్నా ఆరు నెలల నుంచి నలుగురిలో!!

పూర్వం నలుగురిలో నవ్వకు అనేవారు ఇప్పుడు నలుగురిలో దగ్గటం పాపం అయిపొయింది- కోవిడ్ ని అంటకట్టేస్తున్నారు- ఏదో నేరం చేసినవాణ్ణి చూసినట్టు చూడటం, సమాజబహిష్కరణ కూడా అంటరానివాళ్ళలాగా!

దగ్గారా, మనసారా దగ్గాలంటె ఇంకా ఎన్నాళ్ళు ఆగాలో అగమ్యగోచరంగా ఉంది- అందుకే వత్తిడికి లోనవకుండా చిన్నగా దగ్గుతున్నా-మా ఆవిడకి కూడా వినపడకుండా!

అసలు ఈ “ట,టా” లు వాడేవాళ్ళని సమాజం నుంచి వెలివేయాలి-కోవిడ్ ని కాదు. వీళ్ళు దానికంటే ప్రమాదకరం జనానికి-సమాజానికి కూడాను!!

మీకుగాని ఈ “ట”కారాలు వాడేవాళ్ళు తటస్థపడితే ఠప్పున కొట్టండి వాళ్ల నెత్తిన! అంతేగాని ఎవరో కొట్టారు “ట” వాళ్ళని అని మాత్రం చెప్పకండి నా దగ్గరకు వచ్చి- మీరు కొట్టి వచ్చి కొట్టాను అని చెప్పండి.లేదంటే మీ నెత్తిన టపీమని నేను వేయాల్సివస్తుంది-టపా టపా “ట”కారాలతో!

ఇంకొంతమంది ఉంటారు;గోడమీద పిల్లివాటం లాగా!

కొంతమంది తప్పిచ్చుకోవడానికి,వాళ్ళకి తెలిసిన విషయం అయినా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అనో, వీళ్ళ పేర్లు మనం ఎక్కడ చెప్పేస్తామనో-ఎవరో అంటున్నారు “ట”, ఎవరో అంటుంటే విన్నాం అని-వాళ్ళకి ఏమీ అంటకుండా“ట” కారాలతో తప్పించుకునే రకాలన్నమా“ట”! ఇది నేనన్నమాట కాదు-ఉన్నమాటే!

నాకుతెలిసి మీ పరిచయాల్లో కూడా ఈ “ట” కారాలవాళ్ళు ఖచ్చితంగా ఉండేవుంటారు-అవునా!!!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!